ధోని వారసుడు ఎవరు ? తేలేది.. ఈ ఐపీఎల్ లోనే.. !!
మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఆయన వారసుడు ఎవరు ? అనే చర్చ మొదలైంది. గతంలోనే ధోని వారసుడుగా రిషబ్ పంత్ పేరు వినిపించింది. కానీ పంత్ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు. కీలక సమయాల్లో అవుటవుతున్నాడు. పంత్ ప్రతిభ ఉన్నఆటగాడే. కానీ, పరిస్థితులకి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ధోని వారసుడిగా తనని భావించవచ్చని సంజు శాంసన్ మరోసారి గుర్తు చేశాడు.
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ తరపున అద్భుతంగా ఆడి.. మరోసారి అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు. 34 బంతుల్లో 9 సిక్స్‌ల సహాయంతో 74 పరుగులు చేశాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. వికెట్ కీపింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుక కూడా చాలా చురుగ్గా స్పందించాడు. రెండు క్యాచ్‌లు పట్టుకోవడంతో పాటు, రెండు స్టంపౌట్లు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసే లోపు ధోని వారసుడు ఎవరు ? అన్నది స్పష్టత రాబోతుందని క్రికెట్ విశ్లేషకులు చెప్పుకొంటున్నారు. అది పంత్ నా, సంజునా అన్నది చూడాలి మరీ.. !