ముంబైలో మృతి చెందిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్ గుండెపోటుతో కన్నుమూశారు. 59యేళ్ల డీన్ జోన్స్ యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

గురువారం ఉదయం అల్పాహారం తీసుకుని 11 గంటలకు ఆయన ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ బ్రీఫింగ్ సెషన్‌కు హాజరయ్యారు. ఆ తరువాత హోటల్ కారిడార్‌లో సహచరులతో మాట్లాడుతూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

డీన్ జోన్స్ మరణవార్త తనని షాక్ కి గురి చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జోన్స్ ఇక లేరన్న వార్త నమ్మలేకపోతున్నానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఆయన కామెంటరీ అంటే తనకెంతో ఇష్టమని సెహ్వాగ్ అన్నారు. తాను ఆడిన చాలా మ్యాచులకు జోన్స్ కామెంటరీ ఇచ్చారని, ఆయన చనిపోవడం అత్యంత విషాదకరమని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగిన డీన్‌జోన్స్‌ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్‌ 216 సాధించగా 11 శతకాలు నమోదు చేశారు. ఇక వన్డేల్లో 164 మ్యాచ్‌లు ఆడిన ఆయన 6,068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు, 46 అర్ధశతకాలు ఉన్నాయి.