దేశంలో.. ఒక్కరోజే 1,141 కరోనా మరణాలు !
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 80వేలకు పైగానే నమోదవుతుంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొత్త కేసుల సంఖ్యకు దాదాపు సమానంగా, ఇంకా ఎక్కువగానే రికవరీ అవుతున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,141 కరోనా మణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 92,290కు చేరింది.
నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 14లక్షల 92వేల పరీక్షలు చేపట్టారు. వీటిలో 86,052 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,570కు చేరింది. గడిచిన 24గంటల్లో 81వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 47లక్షల 56వేలకు చేరింది. మరో 9లక్షల 70వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81శాతం దాటగా, మరణాల రేటు 1.59శాతంగా ఉంది.