బతికుండగానే విగ్రహం చేయించుకున్న బాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం బతికుండగానే తన విగ్రహాన్ని తయారుచేయించుకోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. విధి రాత అంటే ఇదేనేమో !. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన కళాకారుడు రాజ్ కుమార్ కు బాలు, తన మైనపు విగ్రహాన్ని తయారుచేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు. నెల్లూరులోని తన ఇంటిని వేద పాఠశాలకు ఇచ్చేశారు బాలు. అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాల్ని ఏర్పాటుచేయాలని భావించి రాజ్ కుమార్ కు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకో అదే సమయంలో తన విగ్రహం కూడా తయారు చేయించుకోవాలని ముచ్చటపడ్డారు. తను బతికుండగానే తన విగ్రహం చూసుకోవాలని ఆయన ఆశపడ్డారు. కానీ ఆ ఆశ తీరకుండానే, విగ్రహం సిద్ధమైన సమయానికి ఈ లోకాన్ని వీడారు.
నెల క్రితమే బాలు విగ్రహాన్ని శిల్పులు రెడీ చేశారు. అదే సమయంలో బాలు కరోనా సోకి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. విగ్రహం రెడీ అయిన విషయం కూడా బాలుకు తెలియజేశారు. కరోనా తగ్గిన తర్వాత వస్తానని, స్వయంగా బాలు, శిల్పికి చెప్పారు. కానీ అంతలోనే కన్నుమూశారు. ఇప్పుడు బాలు మరణానంతరం ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వస్తోంది. త్వరలోనే ఈ విగ్రహాన్ని చెన్నైలోని బాలు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. తల్లిదండ్రులతో పాటు బాలు విగ్రహాన్ని కూడా ఒకేసారి ప్రతిష్టించనున్నారు.