అక్టోబర్9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలని పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఈ యేడాది అక్కాచెల్లెలకు ప్రభుత్వ కానుక అందనుంది. అక్టోబర్ 9 నుంచి చీరలని పంపిణీ చేస్తామన్నారు.
కరోనా దృష్ట్యా చీరలను మహిళలకు ఇళ్ల వద్దే బతుకమ్మ చీరలని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు. రూ. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.
2017లో 220 కోట్ల రూపాయాలు, 2018లో 280 కోట్ల రూపాయాలు, 2019లో 313 కోట్లు, 2020లో 317.81 కోట్లు బతుకమ్మ చీరలకు వెచ్చిస్తున్నామని చెప్పారు. 26 వేల పవర్ లూమ్స్‌కు పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఒక్క బతుకమ్మ చీరలకే రూ. 1033 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల చీరలను పంపిణీ చేసింది. 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.