బ్రేకింగ్ : బాబ్రీ మసీదు కేసులో అంతా నిర్ధోషులే !

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ నిర్దోషులేనని కోర్టు తెలిపింది. మసీదు కూల్చివేత కుట్రకాదు. కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు.

విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ నిర్థోషులుగా తేల్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 1992 డిసెంబరు 6న కరసేవ నిర్వహించాలని నిర్వాహకులు తలపెట్టారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పింది. బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ఈ సంఘటనపై అదే రోజు ఫైజాబాద్‌లోని రామ జన్మభూమి పోలీస్‌ స్టేషన్‌లో తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. లక్షల మంది కరసేవకులు నిందితులని ఈ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నా ఎవరి పేరూ నమోదు చేయలేదు.  ఇక ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 30నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు నేడు తీర్పును వెలువరించింది.