బాబ్రీ కేసు తీర్పు : తెలంగాణ భాజపా నేతలు ఏమన్నారంటే ?


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పుపై భాజాపా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన ఈ తీర్పు.. వాస్తవాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చిందని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  దశాబ్దాలుగా ఈ ఘటనను బూచిగా పేర్కొంటూ భాజపాను దోషిగా చూపి రాజకీయ పబ్బం గడిపిన పార్టీలు.. ఇప్పుడేం సమాధానం చెబుతాయని ఆయన ప్రశ్నించారు.

‘ఇన్నాళ్లూ బాబ్రీ కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు భాజపాపై చేస్తున్న ఆరోపణలు తప్పని తాజా తీర్పుతో రుజువైందన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు తప్పుడు ఆరోపణలు, మత రాజకీయాలు మానుకోవాలి’ అని తెలంగాణ భాజాపా సీనియర్ నేత లక్ష్మణ్‌ హితవు పలికారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల ఆకాంక్ష మేరకు అయోధ్యలో రామ మందిరం కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు భాజపా ఎప్పుడూ ప్రయత్నించలేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.