24 పంటలకు మద్దతు ధరలని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

రైతులకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 24పంటలకు మద్దతు ధరలని ప్రకటించింది. 2020-21 ఏడాదికి మొత్తం 24 పంటలకు ధరలను పత్రికా ప్రకటనల ద్వారా తెలిపింది. సీజన్‌ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వరికి క్వింటాల్‌కు రూ.1800, మిర్చీకి రూ.7000 మేర నిర్ణయించింది.

పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.6,850 మద్దతు ధరను నిర్ణయించిన ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి మే వరకు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.770గా నిర్ణయిస్తూ.. ఖరీఫ్‌, ముందస్తు ఖరీఫ్‌, రబీ సీజన్లలో కొనుగోలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గ్రేడ్‌ ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1888, పెసలుకు రూ.7,196, కందులు, మినుములకు రూ.6000, జొన్నలకు రూ.2,640, సజ్జలకు రూ.2,150, రాగులకు రూ.3,295 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. మొక్కజొన్నలకు క్వింటాకు మద్దతు ధర రూ. 1850గా ఖరారు చేసింది.కొబ్బరి బొబ్బరి బాల్‌కు రూ.10,300గా నిర్ణయించింది.