కొవిడ్‌ వైరస్‌పై పనిచేస్తున్న నైట్రిక్‌ ఆక్సైడ్‌

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు స్వీడన్ పరిశోధకులు ఓ ప్రభావవంతమైన చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. 2003లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన సార్స్‌ వ్యాధి నివారణకు చక్కగా ఉపకరించిన ఈ విధానమే కరోనా వైరస్‌నూ కట్టడి చేయగలదని తెలిపారు. రెడాక్స్‌ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనా ఫలితాలు కొవిడ్‌-19 చికిత్సలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ కీలకమని తెలిపాయి. 

యాంటీ వైరల్‌ లక్షణాలు గల ఈ పదార్థాన్ని మానవ శరీరం చాలా సందర్భాల్లో తనంతట తానే ఉత్పత్తి చేసుకోగలదని పరిశోధకులు వివరించారు. తమకు తెలిసినంత వరకూ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఒకటే కరోనా కారక వైరస్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగల ఏకైక పదార్థమని.. పరిశోధనకు నేతృత్వం వహించిన ఉప్సలా విశ్వవిద్యాలయ పరిశోధకుడు అకే లుండ్విస్ట్‌ స్పష్టం చేశారు. దీనిని కరోనా వైరస్‌పై ప్రయోగించినపుడు ప్రభావం స్పష్టంగా కనిపించిందని.. డోసు పెంచిన కొద్దీ కరోనా వైరస్‌పై ప్రభావం కూడా అధికమయ్యిందని వారు తేల్చారు.