ఓటమిపై ధోని ఏమన్నారంటే ?

గత మ్యాచులో పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన ధోనీ సేనకు కోల్‌కతా చేతిలో ఓటమి ఎదురైంది. ప్రత్యర్థి నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. దీంతో 10 పరుగుల తేడాతో ఓటమి చూడాల్సి వచ్చింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ 50(40 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్‌), అంబటి రాయుడు 30(27 బంతుల్లో 3ఫోర్లు) మాత్రమే రాణించారు.

ఓటమిపై మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘మధ్య ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఆ సమయంలో మేం వికెట్లు కోల్పోకుండా, మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. అలా చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. ఛేదనలో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం ముఖ్యం. ఫైనల్‌ ఓవర్లలో బౌండరీలు కొట్టాలని అనుకున్నాం. కానీ, అలా చేయలేకపోయాం. కరన్‌ బౌలింగ్‌ ప్రదర్శన అద్భుతం. బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో బౌలర్ల శ్రమవృథా అయింది’ అన్నారు. 

ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నైకి నాలుగో ఓటమి ఎదురైంది. చెన్నై తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 10న బెంగళూరుతో తలపడనుంది.