రాఘవేంద్ర రావు.. కరోనా పువ్వుని కూడా వదల్లేదుగా.. !

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొత్త సినిమాని ప్రకటించారు. ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతుంది అంటూ ఓ వీడియోని షేర్ చేశారు. రాఘవేంద్ర రావు మార్క్ తో ఈ వీడియోని డిజైన్ చేశారు. పువ్వులు విసిరే అలవాటున్న రాఘవేంద్ర రావు కరోనా పువ్వుని కూడా వదల్లేదు. వీడియోలో కరోనా వైరస్ ని పోలిన రోజా పువ్వుల గుత్తి ఒకటి… సంగీత వాయిద్యాలపై నాట్యం చేయడం ఆకట్టుకుంది.

2017 వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాతో తర్వాత రాఘవేంద్ర రావు మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన సూపర్ హిట్ టైటిల్ పెళ్లి సందడితో సినిమా చేయబోతున్నారు. అంతా కొత్త వాళ్లతో ఈ సినిమాని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా రాఘవేంద్ర రావునే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైపోయాయ్. త్వరలోనే నటీనటుల వివరాలని తెలియజేస్తామని వీడియోలో తెలిపారు.