బ్యాడ్ న్యూస్ : నిలిచిన అమెరికా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు

కరోనా మహమ్మారికి వాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయ్. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే క్లినికల్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్ రావడంతో.. ప్రయోగాలు నిలిచిపోతున్నాయి. తాజాగా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్న అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ప్రయోగాలు నిలిచిపోయాయ్.

ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తిలో ఇటీవల వివరించలేని అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించింది. భద్రతా ప్రమాణాల ప్రకారం ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల్లో ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించింది. మూడో దశ కోసం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించనున్నట్లు తెలిపింది. దీనికి ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడీ ప్రక్రియని నిలుపుదల చేశారు.