తెలంగాణ అసెంబ్లీ ముట్టడి.. తీవ్ర ఉద్రిక్తత !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ శాసనసభ, రేపు శాసనమండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడి ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తలకి దారి తీసింది. వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు.