జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – ఐదు సవరణలు.. ఇవే !
తెలంగాణ శాసనసభ సమావేశం అయింది. మంత్రి కేటీఆర్ శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు.
ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. 2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణలో 5 నుంచి 6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్ కవర్‌కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పజెప్పామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే నాలుగు రకాల కమిటీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శక్తివంతమైన అస్త్రంగా ఈ కమిటీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల ప్రజాప్రతినిధులకు జవాబుదారీ తనం లేకుండా పోతోంది. రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్ ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చాం. అదే పాలసీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.