కోహ్లీపై రాహుల్ గెలుపు
ఐపీఎల్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై పంజాబ్ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(48; 39 బంతుల్లో 3×4), క్రిస్‌మోరిస్(25*; 8 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్(61; 49 బంతుల్లో 1×4, 5×6), క్రిస్‌గేల్(53; 45 బంతుల్లో 1×4, 5×6) అర్ధ శతకాలతో రెచ్చిపోవడంతో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని పంజాబ్… మ్యాచ్ చివరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. చివరి ఓవర్ లో రెండు పరుగులు అవసరమైన వేళ.. చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ పడగా, మూడో బంతికి గేల్ సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి రాహుల్ పరుగు చేయలేక ఐదో బంతికి షాట్ ఆడి పరిగెత్తాడు. అయితే, గేల్ పరుగులో వేగం తగ్గడంతో రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీస్తుందేమో అనే సందేహం ఏర్పడింది. కానీ చివరి బంతికి పూరన్(6) సిక్సర్ బాదడంతో పంజాబ్ ఊపిరి పిల్చుకుంది