బతుకమ్మ పండగ.. శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి !

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రకృతితో మమేకమై జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు. మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తాను. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నాను” అని వెంకయ్య ట్వీట్ చేశారు.

ఇక నిన్నటి (శుక్రవారం) నుంచి బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయ్.  తొమ్మిదిరోజుల పాటు కొనసాగుతున్నాయ్. ఈ తొమ్మిది రోజులు ఏం జరుగుతుందటే..

1. ఎంగిలి పూల బతుకమ్మ : మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్తరమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేథ్యం చేస్తారు.

2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేథ్యం.

3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేథ్యం తయారు చేసి సమర్పిస్తారు.

4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేథ్యం.

5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేథ్యంగా తయారుచేసి సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేథ్యమేమి సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేధ్యం చేస్తారు.

8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేథ్యం తయారు చేస్తారు.

9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేథ్యాల తయారు చేస్తారు. పెరుగన్నం,
చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం లాంటివి చేసి సమర్పిస్తారు.