భారీ వర్షాల ఎఫెక్ట్.. భాగ్యనరగంలో కరోనా విజృంభణ ?
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే అనిపించింది. ఇటీవల కాలంలో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే సమాయంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా నుంచి తెలంగాణ ప్రజలు క్రమంగా బయటపడినట్టే అనుకున్నారు. కానీ ఇంతల్లో భారీ వర్షాలు భాగ్యనగరాన్ని వణికించాయి. వర్షాలతో కొన్ని కాలనీలు నీట మునిగాయి. మొత్తం బురదమయం అయ్యాయి.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1436 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,22,111కు చేరింది. కరోనాతో నిన్న ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,271కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,050 ఉన్నాయి. వీరిలో 18,279 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి మరో 2,154 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,98,790కి చేరింది.