డబుల్ సూపర్ ఓవర్’లో పంజాబ్ విన్ !
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ లు మస్త్ మజాని పంచాయి. హైదరాబాద్-కోల్ కతా జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ లో తేలింది. కోల్ కతా విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ (ముంబై-పంజాబ్) ఏకంగా డబుల్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డికాక్ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్ (24*, 12 బంతుల్లో, 4×4) మెరిశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ఓవర్కు దారి తీయగా.. సూపర్ ఓవర్ కూడా టైగా మారింది. దీంతో మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. దీనిలో పంజాబ్ పైచేయి సాధించి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత జరిగిన సూపర్ ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను అయిదు పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం షమి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబయి సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అనంతరం మరో సూపర్ఓవర్లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్, మయాంక్ లక్ష్యాన్ని మరో రెండు బంతులుండగానే ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు.