దసరా నాటికి యాదాద్రి ప్రధానాలయ దర్శనాలు: ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే మే లోగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని, దసరా నాటికి ప్రధాన ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టి ఏడాది మూడు నెలలు గడిచిందని , సీఎం ఇచ్చిన ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు.
ఆలయ అభివృద్ధి పనుల్లో చాలా పురోగతి కనిపిస్తోందని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఏప్రిల్ లేదా మే నెల నాటికి పనులు పూర్తవుతాయని భావిస్తున్నామని, గర్భాలయ ప్రవేశం ఎప్పుడు అనే విషయం సీఎంతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆలయం రూపుదిద్దుకుంటున్న తీరు అద్భుతమని, సీఎం కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదన్నారు.