పంత్.. ఇంకా గల్లీ క్రికెట్ ఆడితే ఎలా ?

యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై దేశం భారీ ఆశలు పెట్టుకొంది. ఆయన్ని మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా చూసింది. రాబోయే రోజుల్లో టీమిండియా విజయాల్లో పంత్ కీలక పాత్ర పోషించాలని ఆశించింది. కానీ పంత్ మాత్రం ఆ అంచనాలని అందుకోవడం లేదు. తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కనీసం అంతర్జాతీయ క్రికెట్ స్థాయి ఆయనలో కనిపించడం లేదు. బ్యాటింగ్ గురించి పక్కనపెడితే వికెట్ కీపర్ గా అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. మంగళవారం పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోవడానికి పంత్ నే కారణం.

మంచి ఊపుమీదున్న పూరన్ (5)3 ని రన్ అవుట్ చేసే అవకాశాన్ని జార విడిచాడు. ఆ తర్వాత పూరన్ పూనకం వచ్చినట్టు ఆడాడు. పంజాబ్ ని విజయతీరాలకు చేర్చాడు. పూరన్ ని రన్ అవుట్ చేసి ఉంటే.. ఢిల్లీ గెలిచేదే. ఆ తర్వాత కూడా అశ్విన్ వేసిన ఓవర్ లో ఓ క్యాచ్ ని వదిలేశాడు. చివరలో స్టాయినిస్ కూడా ఈజీ క్యాచ్ ని వదిలేశాడు. ఫలితంగా ఢిల్లీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఓడింది.

ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో 20 ఓవర్లకు ఢిల్లీ 164 పరుగులు చేసింది. అయితే టార్గెట్ ని ఢిల్లీ జట్టు కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే విజయవంతంగా ఛేదించింది. నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6), మాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4), క్రిస్‌గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. దీంతో శిఖర్‌ ధావన్‌ (106*) అద్భుత శతకం వృథా అయింది.