నాయిని అంత్యక్రియలు పూర్తి

తెరాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. నాయిని అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల, మహమూద్‌ అలీ, ఎంపీ కె.కేశవరావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

సెప్టెంబరు 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యుమోనియా సోకినట్లు తేల్చారు. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 13న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి నాయిని తుదిశ్వాస విడిచారు.