మణిరత్నంని టార్గెట్ చేసిన నెటిజన్స్

దక్షిణాదిన #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది సింగర్ చిన్మయి శ్రీపాద. ప్రముఖ సినీ రచయిత వైరముత్తుపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో చిన్మయి నిషేధానికి గురైంది. అయితే మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న  గాయకుడు కార్తిక్‌ కు దర్శకుడు మణిరత్నం అవకాశం ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

మణిరత్నం తన తర్వాతి ప్రాజెక్టు ‘నవరస’ను ప్రకటించారు. ఆయన, జయేంద్ర పంచపకేశన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొమ్మిది కథలతో.. తొమ్మిది మంది దర్శకులు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కేవీ ఆనంద్, గౌతమ్ మేనన్‌, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్, హలిత షలీమ్, అరవింద్ స్వామి, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఎటువంటి పారితోషికం తీసుకోకుండా వీరు ఈ సినిమా కోసం పనిచేయబోతుండటం విశేషం.

ఈ సినిమా కోసం గాయకుడు కార్తిక్‌ కూడా పనిచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘మీటూ’ ఆరోపణలు ఉన్న అతడ్ని మణిరత్నం తన సినిమాకు తీసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు, గాయని చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతుంటే.. వేధించిన వారికి మాత్రం పని కల్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేయడంతో.. మణిరత్నం హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.