డిసెంబర్ 8న నిహారిక పెళ్లి.. వేదిక ఎక్కడో తెలుసా ?

మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి డేటు ఫిక్సయింది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.

ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. ఆయన హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇక ఇటీవల నిహారిక తన స్నేహితుల కోసం బ్యాచిలరేట్‌ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం వారితో కలిసి ప్రత్యేకంగా గోవా వెళ్లి వచ్చారు.