ఇకపై వాట్సాప్ ద్వారా కూడా చెల్లింపులు
వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్. వాట్సాప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) గురువారం వెల్లడించింది. దీంతో ఇకపై వాట్సాప్ యాప్ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చు.
కేంద్రం అనుమతులపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జుకర్ వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. వాట్సాప్ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని, 140కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పేమెంట్స్ జరుపుకోవచ్చని వెల్లడించారు. చెల్లింపులకు మరింత భద్రత కల్పించేలా త్వరలోనే వాట్సాప్ యూపీఐని తీసుకురానున్నట్లు జుకర్ చెప్పారు. పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.