ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే ?

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మరోసారి నిరాశపరిచింది. కప్ గెలవడానికి రెండగుల దూరంలో నిలిచిపోయింది. శుక్రవారం హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ చేతితో ఓడింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి, ఆవేదనని వ్యక్త పరుస్తున్నారు.

ఇక మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ తన ట్విట్టర్ లో.. జట్టు బృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకొన్నారు. ‘ఒడుదొడుకుల సమయాల్లో జట్టు సమష్టిగా ఉంది. ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉంది. ఇక పరిస్థితులు మాకు అనుకూలంగా మారలేదనేది నిజమే అయినా మా ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది. ఎప్పటిలాగే మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాం’ అని రాసుకొచ్చారు.

నిన్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. డివిలియర్స్‌(56) అర్ధశతకంతో మెరవడంతో ఆ మాత్రమైనా స్కోర్‌ సాధించింది. లేదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఇక ఛేదనలో హైదరాబాద్‌ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేన్‌ విలియమ్సన్‌(50*), జేసన్‌ హోల్డర్‌(24*) ఒత్తిడిలో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో వార్నర్‌సేన రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది.