బీహార్ ఫలితాలపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాలని గెలుచుకున్న సంగతి తెలిసిందే. బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో గెలుపొందగా.. మహాగట్ బంధన్ 110, ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకుంది. దీంతో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీహార్ ఎన్నికలపై తొలిసారి స్పందించిన మహాగట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం ఎన్డయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపించారు.ఈ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి 119 స్థానాలు గెలిచిందని, అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని ఆర్జేడీ ఆరోపించింది.
“బిహార్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. కానీ ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసింది. నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015లో కూడా దాదాపు ఇలాంటిదే జరిగింది. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారు. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డదారులు వెతుక్కుంది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించింది” అని తేజస్వీ యాదవ్ అన్నారు.