ఎంఐఎం మేయర్ పదవి.. టీఆర్ఎస్ డీల్ !
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎల్లుండే నోటిఫికేషన్ జారీ కానుంది. డిసెంబర్ 4నే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెరాస, ఎన్నికల సంఘంపై తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ భాజాపా కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు తెరాస రెడీ అయింది. ఈ మేరకు ఆ పార్టీతో ఒప్పందం చేసుకుందని బండి సంజయ్ ఆరోపించారు. 63 డివిజన్లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని చెప్పారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి కానీ అలా జరగలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.
ఎంఐఎం చెబితే టీఆర్ఎస్, టీఆర్ఎస్ చెబితే ఎన్నికల సంఘం వింటుందన్నారు. అంతేకాదు.. మేయర్ పదవి ఎంఐఎంకు దక్కకుండా అడ్డుకుంటామని.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో భాజాపా 100 స్థానాలని గెలుచుకుంటుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా బండి సంజయ్ చేసిన ఆరోపణలు జీహెచ్ ఎంసీ ఎన్నికల వ్యూహంలో భాగమని తెరాస శ్రేణులు అంటున్నాయ్. గ్రేటర్ ఎన్నికల్లో హిందు-ముస్లిం కార్డుపై భాజాపా లబ్ధపొందేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు.