కోహ్లీతో నెట్‌ఫ్లిక్స్ సెల్ఫీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాలనే కోరిక తీరిందని నెట్‌ఫ్లిక్స్ ఆనందం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే ? ప్రస్తుతం సిడ్నీలో ఉన్న కోహ్లీ క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్నాడు. క్వారంటైన్‌ను ఆస్వాదిస్తున్నానని, సౌకర్యవంతమైన మంచం, చూడటానికి మంచి వెబ్‌సిరీస్‌లు ఉన్నాయని పేర్కొంటూ కోహ్లీ తన సెల్ఫీని మంగళవారం ట్వీట్ చేశాడు.

అయితే ఫొటోలో ఉన్న ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్‌సిరీస్‌లు కనిపించాయి. దీంతో కోహ్లీ ట్వీట్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా రీట్వీట్ చేస్తూ పోస్ట్ చేసింది. ”ఆ కంప్యూటర్‌ తెరపై మేం ఉన్నాం. విరాట్ కోహ్లీతో కలిసి ఫొటో దిగాలనుకున్న మా కల నెరవేరింది” అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.