గ్రేటర్ పోరు : కిషన్ రెడ్డి డబుల్ ఎటాక్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తెరాస ముందుంది. శుక్రవారం నుంచే ఆ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న సాయంత్రం పలుకాలనీల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోస్ నిర్వహించారు. ఆరేళ్లలో హైదరాబాద్ ని అద్భుతంగా అభివృద్ది చేశాం. అభివృద్ది చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత హైదరాబాద్ ప్రజలకి ఉందన్నారు. గల్లీ ప్రభుత్వం కావాలా ? ఢిల్లీ ప్రభుత్వం కావాలా ? ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఇక భాజాపా రేపటి నుంచి గ్రేటర్ ప్రచార పర్వానికి తెరలేపనుంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కిషన్ రెడ్డి గ్రేటర్ ప్రచారం గురించి తెలిపారు. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణకి గడువు ముగియనుంది. ఇక రేపటితో భాజాపా నేతలు ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా గత దఫా గ్రేటర్ ఎన్నికల్లో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామనే హామీ ఇచ్చి తెరాస గెలిచింది. ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. దీనిపై తెరాస నేతలని నిలదీయాలని పిలుపునిచ్చారు. 30-40లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ లని ఇస్తామన్నారు. ఇప్పటి వరకు లక్ష ఇళ్లని కూడా ఇవ్వలేదు.
గ్రాఫిక్స్ తో హైదరాబాద్ ప్రజలని భ్రమలో పెడుతోంది తెరాస ప్రభుత్వం. గుంతలేని రోడ్లు లేవు. పైకి హైదరాబాద్ డల్లాస్, ఇస్తాంబుల్ అని చెప్పుకొంటున్నారు. కనీసం వసతులని ఇవ్వడం లేదు. ప్రజలని భ్రమలో పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. తెరాస నేతలు గల్లీలలోకి వస్తే వారిని నిలదీయండి. డబుల్ బెడ్ రూమ్స్ ఎందుకు ఇవ్వలేదని అగడగండి కిషన్ రెడ్డి కోరారు.