ఏపీలో నివర్ బీభత్సం
ఏపీలో నివర్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ ఉదయం మొదలైన వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తిరుపతిలో నివర్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పుల్లూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుల్లురు క్రాస్ నుంచి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కపిలతీర్థం జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కమలాపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేణిగుంట- కడప జాతీయ రహదారిలో కడప జిల్లా సరిహద్దులో రోడ్లు దెబ్బతిన్నాయి. ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో మల్లిమడుగు వాగులో వరద పోటెత్తడంతో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పెనుగాలులు వీచడంతో యాదమరి మండలంలో ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి.