ఉత్తమ్ స్థానంలోకి కోమట్ రెడ్డి !
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలోకి ఆ పార్టీ సీనియర్ నేత కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి వచ్చేశారు. ఎప్పటి నుంచో వెంకట్ రెడ్డి టీ-పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం టీ-పీసీసీ అధ్యక్షుడిని మారుస్తున్నట్టు ప్రకటన, లీకులు ఇవ్వలేదు. అలాంటిది టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ స్థానంలోకి వెంకట్ రెడ్డి ఎలా వచ్చారు ? అంటే.. వచ్చారని చెప్పుకొంటున్నారు టీ-కాంగ్రెస్ శ్రేణులు. అదెలాగా ? అంటే చిన్నపాటి వివరణ కూడా ఇస్తున్నారు.
ఇటీవలే మంత్రి కేటీఆర్ టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ (2019) టీఆర్ఎస్ నే అధికారంలోకి వస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి రాలేనట్టేయితే.. తానూ రాజకీయాల నుంచి తప్పుకొంటా. మళ్లీ టీఆర్ఎస్ నే అధికారంలోకి వస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజకీయాల నుంచి తప్పుకొంటారా ? అంటూ సవాల్ విసిరాడు.
ఈ సవాల్ ని ఎందుకో గానీ ఉత్తమ్ సీరియస్ గా తీసుకోలేదు. కనీసం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఓ రోజు వేచి చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తమ్ స్థానంలో సవాల్ స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతే ఉత్తమ్ తో పాటు తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరాడు. ఇప్పుడీ సవాల్ టీ-కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సవాల్ తో తనలోని దూసుకుపోయే తనాన్ని అధిష్టానానికి చూపించే ప్రయత్నం చేశారు కోమట్ రెడ్డి. ఆయన సవాల్ ని కూడా కాంగ్రెస్ నేతలు సపోర్టు చేస్తున్నారు. ఈ లెక్కన ఉత్తమ్ స్థానంలోకి కోమట్ రెడ్డి వచ్చారని చెప్పుకొంటున్నారు. మరీ.. ఈ పరిణామాలన్నింటినీ గమనించి కాంగ్రెస్ అధిష్టానం నిజంగానే ఉత్తమ్ స్థానంలో వెంకట్ రెడ్డిని తీసుకొస్తుందేమో చూడాలి.