టీ20ల్లో ఇంగ్లాండ్ టాప్ 

టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌ విజయంతో ఇంగ్లాండ్‌ (275) తమ రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (275), భారత్ (266), పాకిస్థాన్‌ (262), దక్షిణాఫ్రికా (252) ఉన్నాయి.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది. డసెన్‌ (74*, 32 బంతుల్లో, 5×4, 5×6), డుప్లెసిస్‌ (52; 37 బంతుల్లో, 5×4, 3×6) అర్ధశతకాలతో మెరిశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ వికెట్ కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ మలన్‌ (99*; 47 బంతుల్లో, 11×4, 5×6), జోస్‌ బట్లర్ (67*; 46 బంతుల్లో, 3×4, 5×6) అదరగొట్టారు.