ఎమ్మెల్యేల సపోర్ట్ లేకే తెరాస అభ్యర్థులు ఓడారా ?

గ్రేటర్ లో గులాభి పార్టీకి షాక్ తగిలింది. సెంచరీ కొట్టాలని బరిలోకి దిగిన తెరాస.. హాఫ్ సెంచరీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 56 స్థానాలకి మాత్రమే పరిమితం అయింది. మంత్రుల ఇలాకలోనూ తెరాస అభ్యర్థులు దారుణంగా ఓడారు. మంత్రి తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జీలు ఉన్న స్థానాల్లో తెరాస అభ్యర్థులు ఓడారు. ఈ నేపథ్యంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తెరాస అభ్యర్థులకి సపోర్ట్ దక్కలేదని చెప్పుకొంటున్నారు.

రామ్ నగర్ తెరాస అభ్యర్థి వి. శ్రీనివా్‌సరెడ్డి.. తనకి ఎమ్మెల్యే ముఠా గోపాల్ సహరించలేదని ఆరోపించారు. ఈసారి డివిజన్ల డీ లిమిటేషన్‌ లేదని, అయినా రాంనగర్‌ డివిజన్‌లోని మేదరబస్తీ, శాస్త్రీనగర్‌, జెమినీకాలనీ ప్రాంతాల్లోని ఐదు బూత్‌లకు చెందిన 5,500 ఓట్లను ముషీరాబాద్‌ డివిజన్‌లో అక్రమంగా కలిపారని ఆయన ఆరోపించారు. తనను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్తీలను తొలగించారన్నారు. మరీ.. ఈ విషయాన్ని తెరాస అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా ? అన్నది చూడాలి.