ఇళయరాజాని ఒప్పించిన మెగాస్టార్ ?
మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా ‘సైరా నర్సింహారెడ్డి’కి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించేందుకు అంగీకరించినట్టు సమాచారమ్. ముందుగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా ఎఆర్ రెహమాన్ ని తీసుకొన్నారు. ఐతే, బిజీ షెడ్యూల్ కారణంగా పని మొదలు పెట్టకముందే రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు.
ఆ తర్వాత ‘సైరా’ టీజర్’కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన థమన్ నే సంగీత దర్శకుడిగా తీసుకొన్నారనే టాక్ వినబడింది. ఐతే, థమన్ ని తీసుకోవడంపై మెగా అభిమానుల నుంచి నెగటివ్ కామెంట్స్ వినిపించింది. ఆ తర్వాత సైరా కోసం సంగీత దర్శకుడు కీరవాణిని ఒప్పించే పనిలో రామ్ చరణ్ ఉన్నాడనే వార్తలు వినిపించాయి. వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో సైరా సంగీత దర్శకుడు ఎవరు విషయంలో సందిగ్థత కొనసాగుతూనే వస్తోంది.
ఇప్పుడీ సందిగ్థతకు తెరపడినట్టు సమాచారమ్. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇళయరాజను కలిసినట్టు చెప్పుకొంటున్నారు. ఈ సందర్భంగా ‘సైరా నర్సింహారెడ్డి’ కోసం సంగీతాన్ని అందించాలని మెగాస్టార్ కోరడం.. దానికి ఆయన అంగీకరించడం జరినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఇదే నిజమైతే ‘సైరా’ కోసం అదిరిపోయే మ్యూజిక్ కుదరడం ఖాయమనే చెప్పాలి.