కేంద్రంతో లాలూచీ.. బాబుకు తప్పదేమో !

సాధారణ ఎన్నికలకు యేడాది ముందుగానే తెలుగు రాష్ట్రం ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైపోయింది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళన కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం లైట్ తీసుకొంది. ఎంత ఒత్తిడి పెంచినా ఏపీపై పాత పాటే కొత్తగా పాడారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ.

ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలని నెరవేర్చేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జేఏసీ కోసం ప్రయత్నాలు చేయడం.. ‘జేఎఫ్’సీ’ ఏర్పాటు చేయడం కూడా జరిగిపోయాయి. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నిర్ణయం అధికార టీడీపీని తీవ్ర ఒత్తిడిలోకి పడేసిందనే చెప్పాలి.

వైసీపీ నిర్ణయంతో కాస్త షాక్ కు గురైన టీడీపీ కేంద్రంపై అంచెలంచెలుగా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో 5 స్టెప్పుల ప్రణాఌకని సిద్ధం చేసుకొంది. మరోవైపు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అంతరంగాన్ని ప్రజల ముందు ఉంచాలని ఏపీ సీఎం పార్టీ నేతకు సూచించారు. ‘మనం ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం. జగన్‌ ఏది చేసినా కేంద్రంతో లాలూచీపడి కేసులు మాఫీ చేయించుకోవడం కోసమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.

ప్రస్తుతం జగన్ లక్ష్యం కేసుల మాఫియే కావొచ్చు. ఇప్పుడా మరక ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు కూడా అంటింది కదా. మరీ.. భవిష్యత్ లో జగన్ మాదిరిగా చంద్రబాబు కేంద్రంతో లాలూచీపడక తప్పేదేమోననే గుసగుసలు వినబడుతున్నాయి. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి.