కేసీఆర్ 3రోజుల ఢిల్లీ టూర్.. కేంద్రాన్ని దువ్వేందుకేనా ?

కేంద్రంతో కయ్యం అంత మంచిది కాదు. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయన మొదటి నుంచి కేంద్రానికి సహకరిస్తూ వస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టీకల్ 360 రద్దు, కరోనా లాక్‌డౌన్ తదితర విషయాల్లో కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది.

2019 సార్వత్రిక ఎన్నికల ముందు థర్డ్ పార్టీ అంటూ సీఎం కేసీఆర్ హడావుడి చేసినా.. దాని వెనక ఉన్న లక్ష్యం మాత్రం భాజాపాకు మంచి చేయడమే. థర్డ్ పార్టీ కోసం సీఎం కేసీఆర్ కలిసిన ముఖ్యమంత్రులంతా ఎన్డీయే వ్యతిరేకులే. వారిని యూపీఏకు దూరం చేయాలనే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అయితే ఇటీవల కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వానికి బాగా గ్యాప్ వచ్చింది.

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భాజాపా-తెరాస నేతలు మాటల యుద్ధం చేసుకున్నాయి. కొన్నిసార్లు హద్దులు మీరారు. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రథకాలని ఎద్దేవా చేశారు. ఫైనల్ గా దుబ్బాక, గ్రేటర్ లో భాజాపాకి మంచి ఫలితాలొచ్చాయ్. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపానే అని స్పష్టత వచ్చింది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూడ్రోజుల ఢిల్లీ పర్యటనకి ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరారు. అది ఖరారైతే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులని కేసీఆర్ కలవనున్నారు. కేంద్రంతో పెట్టుకున్న చంద్రబాబు అధికారికానికి దూరం అయ్యాడు. ఆ తప్పు కేసీఆర్ చేయకూడదని భావిస్తున్నారు. అందుకే కేంద్రాన్ని దువ్వనున్నారు.

అవసరమైతే.. కేంద్రం ముందు కేసీఆర్ సరికొత్త ప్రపొజల్ కూడా పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే ఎన్ డీయేలో చేరడం. ఇటీవల వైసీపీ ఎన్డీయేలో చేరనుందనే ప్రచారం జరిగింది. కానీ అది ఫైనల్ కాలేదు. ఇప్పుడీ ఈ ఆఫర్ ని కేసీఆర్ వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. అయితే దానికి కేంద్రం ఒప్పుకోకపోవచ్చు. మొత్తానికి.. కేంద్రంతో కేసీఆర్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసే విధంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండనుందని సమాచారమ్.