గ్రేటర్ ఎఫెక్ట్ : అల్లుడుపై కేసీఆర్’కు ప్రేమ పెరిగిందిగా !

తనయుడు కేటీఆర్ కోసం అల్లుడు హరీష్ రావుని సీఎం కేసీఆర్ పక్కన పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. హరీష్ రావుని తొక్కేస్తున్నారు. తెరాసలో హరీష్ రావుపై అనాఫిషియల్ బ్యాన్ విధించారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. కేటీఆర్ కోసం హరీష్ రావుని బలి చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

అవి నిజమేనేమో ! అన్నట్టుగా రెండో దఫా తెరాస అధికారంలో వచ్చినా హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు. అదే సమయంలో కొడుకు కేటీఆర్ కి పార్టీ బాధ్యతలని అప్పగించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో హరీష్ రావుకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వక తప్పలేదు. కానీ హరీష్ రావు విషయంలో ఎప్పటికప్పుడు చిన్న చూపు కనిపిస్తూనే ఉంది.

అయితే గ్రేటర్ ఫలితం, తెలంగాణ భాజాపా విజృంభిస్తుండటంతో కేసీఆర్ దిగొచ్చారు. అల్లుడిని దగ్గరకు తీస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుని పిలిపించుకొని చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయ్. ఇక తాజా సిద్దిపేట పర్యటనలోనూ అల్లుడు హరీశ్ రావుని పొగడ్తలతో ముంచెత్తాడు కేసీఆర్. మునుపెన్నడూ లేనంతగా.

సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా రెండో చోట్లా తాను విజయం సాధించానని.. తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ పదవిలో కొనసాగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సమయంలో ఎంతో దుఃఖించామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటపుడు ఆణిముత్యంలాంటి నాయకుడిని ఇచ్చి వెళ్లానని మంత్రి హరీశ్‌ను ఉద్దేశించి చెప్పారు. హరీశ్‌ తన పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశారనే సంతోషం గుండెలనిండా ఉందని కేసీఆర్‌ కొనియాడారు.