భాజాపాకు షాక్ : కమలం గుర్తుని వెనక్కి తీసుకుంటారా ?

బీజేపీ ఎన్నికల గుర్తు – కమలం. ఇప్పుడీ.. ఈ గుర్తుని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవాలని అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన కాళీ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. కమలం గుర్తు జాతీయ పుష్పం. ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఇది కనిపిస్తుంది. కాబట్టి ఈ గుర్తును వాడేందుకు ఏ పార్టీకి అనుమతి ఇవ్వొద్దని పిటిషన్ లో పేర్కొన్నారు. వివిధ పార్టీలకు కేటాయించే గుర్తులను ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని కోరారు.

గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై కాళీ శంకర్ గతంలోనూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన వాదనని ఈసీ తోసిపుచ్చింది. తాజాగా దీనిపై ఆయన కోర్టుకెక్కారు. ఈ పిటిషన్ అలహాబాద్ కోర్టు వచ్చే నెల 12న విచారించనుంది. మరీ.. పిటిషనర్ వాదనతో కోర్ట్ ఏకీభిస్తుందా ? బీజేపీ కమలం గుర్తుని రద్దు చేస్తుందా ?? అన్నది చూడాలి. అదే జరిగితే.. బీజేపీ పెద్ద దెబ్బ తగిలినట్టే.