ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్.. ఇద్దరు హీరోలపై సటైర్లు !
అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకుంది ఎఫ్ 2. 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు చిత్రాల జాబితాలో నిలిచింది. ఎఫ్ 2 రిలీజ్ టైమ్ లో సీక్వెల్ ఎఫ్ 3 ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది.
ఇప్పుడీ ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆదివారం విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. కథానాయికలిద్దరూ.. గార్బేజ్ ట్రాలీల్లో డబ్బులు పోసుకుని వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్ డిజైన్ చేసారు. అయితే ఈ పోస్టర్ తో వెంకీ, వరుణ్ లపై నిర్మాత సటైర్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ? ఎఫ్ 3లో నటించేందుకు వెంకీ, వరుణ్ లు భారీగా డిమాండ్ చేశారట.
వెంకీ తరపును సురేష్ బాబు నిర్మాణంలో భాగస్వామ్యం కోరారని, ఆఖరికి ఏం ఒప్పందం కుదిరిందో అన్నది తెలియదు కానీ, దాని ఫలితంగా వెంకీకి 12 కోట్లకు పైగా ముడతాయని గ్యాసిప్ లు వినిపించాయి. దాని తరువాత వరుణ్ తేజ్ కూడా గట్టిగా డిమాండ్ చేసారని, ఆఖరికి ఎనిమిది కోట్ల దగ్గర సెటిల్ అయిందనే గ్యాసిప్ లు వినిపించాయి. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన హీరోలిద్దరిపై నిర్మాత ఇలా కాన్సిప్ట్ పోస్టర్ పేరిట సింబాలిక్ సటైర్ వేశాడని చెప్పుకొంటున్నారు.