కమనీయం.. శ్రీ లక్ష్మీనారసింహుడి కళ్యాణం.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం బాలాలయంలో వైభవోపేతంగా జరిగింది.
ఈనెల 17 న స్వస్తివాచనంతో ప్రారంభమైన యదాద్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 తో ముగుస్తాయి. రెండవరోజు ధ్వజారోహణం, మూడవరోజు నుంచి స్వామివారికి వివిధ అలంకార, వాహన సేవలు వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం స్వామివారిని శ్రీరామలంకారంలో సేవించి, హనుమద్వాహనం, గజవాహనం పై ఊరేగించిన అనంతరం తిరుకళ్యాణ మహోత్సవ ఘట్టం ప్రారంభమైంది.
రక్షాబంధనం, యజ్ఞోపధారణ, జీలకర్ర బెల్లం తంతుతో వైభవంగా జరిగిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అందరూ కనులారా వీక్షించి పులకించిపోయారు. బ్రహ్మయే స్వయంగా, దేవతలందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారని క్షేత్ర పురాణం చెబుతోంది. స్వామివారి కళ్యాణ వైభోగం చూడటానికి దేవతలు కూడా విచ్చేస్తారని ప్రతీథి. అందుకే బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున దేవతాహ్వానం చేస్తారు కూడా.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తుల సందర్శనార్థం కొండకింద ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్వామివారి వైభవోత్సవా కల్యాణం నిర్వహించారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కన్నులపడుగగా జరిగిన యదాద్రిశుడి వైభవోత్సవ కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనులు పులకించి పోయారు. గోవింద నామ స్మరణతో ఆ లక్ష్మీ నారసింహుడి కళ్యాణం చూసి ఆనందంతో పరవశించారు.