షాకింగ్ : శ్రీదేవి ఇకలేరు

అందం, అభినయంతో ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమా అభిమానుల్ని అలరిస్తున్న శ్రీదేవి (54) ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు. ఈ మరణ వార్త సినీ పరిశ్రమని, ఆమె అభిమానులని షాక్ కు గురిచేసింది. 1963 ఆగస్టు 13న అయ్యప్పన్‌, రాజేశ్వరి దంపతులకు శివకాశీలో జన్మించారు శ్రీదేవి. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయాంగర్‌ అయ్యప్పన్‌. శ్రీదేవికి శ్రీలత అనే సోదరి ఉంది.

శ్రీదేవి నాలుగేళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమకు బాలనటిగా పరిచయమయ్యారు. ఎంఏ తిరుమురుగన్‌ దర్శకత్వంలోని ‘తునైవన్‌’ చిత్రంలో సుబ్రమణ్యస్వామి పాత్రలో తెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘కనిముత్తు’, ‘వసందమాలిగై’, ‘భారత విలాస్‌’ వంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించారు. జయలలిత వంటి పలువురు హీరోయిన్లకు ముద్దులొలికే పాపాయిగా నటించారు. ‘మా నాన్న నిర్దోషి’లో బాలనటిగా తెలుగులో ప్రవేశించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి పలు చిత్రాల్లో బాలనటిగా భిన్నమైన పాత్రలు పోషించారు.

దర్శకుడు కె. బాలచందర్ శ్రీదేవి ‘మూండ్రు ముడిచ్చు’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఇందులో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కలసి నటించారు. అప్పుడు శ్రీదేవి వయసు 13యేళ్లు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 300పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో అప్పటి స్టార్‌ హీరోలు అందరితోనూ నటించారు. ఎన్టీఆర్‌తో ‘వేటగాడు’, కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’లాంటి హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏఎన్నార్‌తో ‘ముద్దులకొడుకు’, ‘ప్రేమ కానుక’, ‘ప్రేమాభిషేకం’, శోభన్‌బాబుతో ‘కార్తీకదీపం’, ‘దేవత’ ఇలా పలు చిత్రాల్లో తనదైన అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారామె. తెలుగులో అత్యధికంగా కృష్ణతో 33 చిత్రాల్లో నటించారు శ్రీదేవి. ఆయనతో కలిసి ‘కంచు కాగడ’, ‘కలవారి సంసారం’, ‘కృష్ణావతారం’, ‘బుర్రిపాలెం బుల్లోడు’, ‘కిరాయి కోటిగాడు’ తదితర చిత్రాల్లో నటించారు.

నాగార్జునతో ‘గోవిందా గోవిందా’లో నటించి చక్కటి జోడీ అనిపించుకొన్నారు. వెంకటేష్‌తో ‘క్షణం క్షణం’లో ఆమె నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు. చిరంజీవితో కలిసి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’తో శ్రీదేవి ఎంతటి జగదేక సుందరో మరోసారి ప్రేక్షకులు చూశారు. 26 ఏళ్ల తర్వాత 2012లో ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’లో కనిపించారు. ఇందులో అజిత్‌ కూడా అతిథి పాత్ర పోషించారు. 2015లో విజయ్‌ నటించిన ‘పులి’ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించారు శ్రీదేవి. అందులో రాణిగా తనదైన నటన ప్రదర్శించారు. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌. జాన్వి ‘ధడక్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతోంది.