శ్రీదేవి తీరని కోరికలు

అతిలోక సుందరి శ్రీదేవి మరణం దేశ సినీ పరిశ్రమను, ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. ఈ షాక్ లోనూ అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ కంటతడిపెట్టుకొంటున్నారు సినీ స్టార్. ఐతే, సుదీర్ఘ సినీ ప్రయాణంలో శ్రీదేవికి రెండు కోరికలు తీరకుండానే మిగిలిపోయాయి. ఆ రెండు కోరికలు ఏంటంటే.. ?

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌- ఒక డైరెక్టర్‌ కాంబినేషన్‌లో పది సినిమాల కంటే ఎక్కువ ఎక్కడా రాలేదు. కానీ, రాఘవేంద్రరావు -శ్రీదేవి కలయికలో ఏకంగా 24 (తెలుగులో 15, హిందీలో 9) సినిమాలొచ్చాయి. ఇంకొకటి చేస్తే మాది సిల్వర్‌ జూబ్లీ అవుతుందని ఓ సందర్భంలో తన కోరికని వెలుబుచ్చింది అతిలోక సుందరి. చివరకు ఈ కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది అతిలోక సుందరి.

ఆమె రెండో కోరిక ఇంకా బలమైనది. అది ఆమె పెద్ద కూతురు జాహ్నావి కపూర్ ని హీరోయిన్ గా వెండితెరపై చూసుకొని మురిసిపోవాలని ఆశపడింది. కూతురు కోసం గత రెండేళ్లుగా కథ ఎంపిక కోసం కసరత్తు చేసింది. చివరకు ‘దఢక్’ సినిమా ద్వారా జాహ్నావి ఎంట్రీ ఖరారైంది. ఇప్పుడీ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఐతే, కూతురుని వెండితెరపై చూసి మురిసిపోవాలన్న శ్రీదేవి కల… ఆమె ని స్టార్ హీరోయిన్ ని చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయింది.