మెగాస్టార్ ఆహా ముచ్చట్లు విన్నారా ?
సమంత హోస్ట్’గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ఛాట్ షో ‘సామ్‌జామ్. తాజాగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఎన్నో ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. సినిమా, పర్సనల్ విషయాలని చెప్పారు. సురేఖతో పెళ్లి గురించి చెబుతూ.. ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
‘శంకరాభరణం’ సినిమాలో నటించిన మంజుభార్గవి ‘కోతలరాయుడు’ కోసం నాతో కలిసి పనిచేసింది. ఆ పరిచయంతో ‘శంకరాభరణం’ ప్రిమియర్ షోకు రమ్మని ఆహ్వానించింది. ఆ సినిమా క్లైమాక్స్ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. అయితే లైట్స్ ఆన్ చేస్తే నేను ఏడుస్తున్నానని అందరికీ తెలిసిపోతుందని భావించి కర్చీఫ్ కోసం వెతుకుతున్న సమయంలో.. కన్నీళ్లు తుడుచుకోమని మంజుభార్గవి తన చీర కొంగును నాకు అందించింది.
సరిగ్గా కన్నీళ్లు తుడుచుకున్నానో లేదో లైట్స్ ఆన్ అయ్యాయి. అంతే నా చేతిలో ఆమె చీర కొంగు ఉంది. చూసినవాళ్లు ఏం అనుకున్నారో అనిపించింది. ఇక కొంతకాలానికి నాకూ-సురేఖకు పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు. ‘శంకరాభరణం’ ప్రిమియర్ సమయంలో సురేఖ నన్ను చూసే ఉంటుందేమో.. కాబట్టి తప్పకుండా నాకు నో అనే చెబుతుందని కంగారు పడ్డాను. కానీ తను మాత్రం నాతో పెళ్లికి అంగీకరించిందని చిరు చెప్పుకొచ్చారు.