రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ ఖరారు.. సీనియర్లు పార్టీని వీడుతారట !
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు ? అన్నదానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే ఎంచుకుంది. ఆయన్ని పీసీసీ చీఫ్ గా ఖరారు చేసింది. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు. ఈ విషయం ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలకి తెలిసిపోయింది. దీంతో కడుపు మండిన సీనియర్ నేత వీహెచ్ బయటికొచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పీసీపీ రేసులో కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీదర్ రెడ్డి, జీవన్ రెడ్డి, భట్టీ విక్రమార్క్ తదితరులు ఉన్నా.. అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తుంది. రేవంత్ రెడ్డి పీసీసీ పోస్ట్ ఇస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటా. తాను ఒక్కడినే కాదు.. తనతో పాటు చాలామంది పార్టీని వీడుతారని వీహెచ్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. అసలు రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ ఎలా ఇస్తారు? అని కూడా ఆయన ప్రశ్నించారు. టీడీపీని ముంచేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ పాత ఆరోపణలే కొత్తగా చేశారు. ప్రత్యేక తెలంగాణకు ఆయన వ్యతిరేకి అని సెంటిమెంట్ ని తీసుకొచ్చారు. ఏదేమైనా.. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. సీనియర్లు పార్టీలో ఉండాలనుకుంటే.. ఉండొచ్చు. లేదంటే వెళ్లొచ్చని కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టయిందని చెబుతున్నారు.