కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్
నాలుగు రాష్ట్రాల్లో కరోనా వాక్సిన్ డ్రైరన్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈనెల 28, 29 తేదీల్లో ఏపీతో పాటు అసోం, గుజరాత్, పంజాబ్‌లో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీలోని కృష్ణా జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసెంబర్ 28న కృష్ణా జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు సిద్ధం కావాల్సిందిగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తొలి విడతలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సమాచార సేకరణతో పాటు మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ వచ్చిన వెంటనే విడతల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.