రజనీ పొలిటికల్ పార్టీ ప్రకటన క్యాన్సిల్ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న అధికార ప్రకటన చేస్తా. జనవరిలో పార్టీ ఏర్పాటు ఉంటుందని అభిమానులకి హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్లెడ్ ప్రజర్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంకా బెడ్ లెవల్స్ కంట్రోల్ లోకి రాలేదు. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ సాయంత్రం వరకు రిపోర్ట్స్ వస్తాయని అపోలో హాస్పటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. పరిస్థితిని చూస్తుంటే.. రజనీ ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉన్నట్టు అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 31 రజనీ పార్టీ ప్రకటన ఉండకపోవచ్చని చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. షెడ్యూల్ ప్రకారం 31న పార్టీ ప్రకటన ఉంటుంది. అవసరమైతే ఆసుపత్రి నుంచే రజనీ పార్టీ ప్రకటన చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. రజనీ పొలిటికల్ ఎంట్రీకి ఎప్పుడూ కలిసిరావడం లేదు. యేడాది క్రితమే రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించారు. ఆ తర్వాత కామ్ అయిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏదో ఒకటి తేల్చాలన్న అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో వారితో మీటింగ్ నిర్వహించిన రజనీ పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే రజనీ పార్టీని ఏర్పాటు చేసే  క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.