ప్రధాని సూచించిన 2021 తీర్మానాలు
2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడాది ఆఖరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కొత్త ఏడాదిలో భారత్‌ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ తీర్మానించుకోవాలని సూచించారు. అలాగే దేశీయంగా తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
* 2014-18 మధ్య చిరుతపులుల జనాభా 60శాతం పెరిగింది. ఒకప్పుడు దేశంలో 7,900 చిరుతలు ఉండేవి. 2019 నాటికి అవి 12,852కు పెరిగాయి. మధ్య భారతదేశంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే తరహాలో సింహాలు, పులుల సంఖ్య సైతం పెరిగింది. ప్రభుత్వంతో పాటు పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఇది సాధ్యమైంది.
* దైనందిన జీవితంలో మనం వాడుతున్న వస్తువుల్లో విదేశాల్లో తయారవుతున్నవి ఏవో గుర్తించండి. వాటికి దేశీయ ప్రత్యామ్నాయాలేంటో కనిపెట్టి వాటినే వాడేందుకు తీర్మానించుకోండి.
* కశ్మీరీ ‘కేసరి’కి ఈ ఏడాది జీఐ ట్యాగ్ లభించింది. ఇక దీన్ని అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.