‘కేజీఎఫ్‌2’లో బాలయ్య.. నిజం కానీ అబద్దం !

కన్నడ స్టార్‌ యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్‌:ఛాప్టర్‌1’ దేశవ్యాపంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడీ ఈ సినిమా కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌:ఛాప్టర్‌2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. అయితే ఇది నిజం కాదు.. అబద్దం. గూగుల్ తల్లి చెప్పిన అబద్ధం. ఇటీవల గూగుల్ తల్లి చేసిన తప్పిదాలు సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా కేజీఎఫ్ 2లో బాలయ్య అంటూ కొత్త అబద్ధం చెప్పింది. గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల జాబితాలో మన బాలయ్య పేరును కూడా చూపిస్తోంది. అంతేకాదు.. బాలయ్య పోషించబోయే పాత్ర పేరు ‘ఇనాయత్‌ ఖలీల్‌’ అని కూడా ఖరారు చేసింది. ఇప్ప్పుడీ.. న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే కేజీఎఫ్ 2లో బాలయ్య నటిస్తే బాగుణ్ని అని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.