బ్రేకింగ్ : LRS రద్దు.. తొలిసారి ప్రతిపక్షం గెలిచింది


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. అయితే కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తరువాతే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి.

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. 3 నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్‌కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

ప్రతిపక్షాలు ఎల్ఆర్ఎస్ రద్దుపై గట్టిగానే పట్టుబట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ప్రభుత్వానికి ఆల్టీమేటం జారీ చేశారు. ఎల్ ఆర్ ఎస్ రద్దు చేయకపోతే.. దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఎల్ ఆర్ ఎస్ రద్దుని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు దీక్షకి దిగితే వారికి ప్రజా మద్దతు ఉంటుంది. అదో.. ఉద్యమంలా మారుతుందని ప్రభుత్వం భావించినట్టుంది. అందుకే ఎల్ ఆర్ ఎస్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బహుశా.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు సాధించిన తొలి విజయం ఇదొక్కటేనేమో.. !