సోనూసూద్ బుక్’పై మెగా కామెంట్స్ 

మనుషుల్లోనే దేవుడు ఉంటాడని నిరూపించిన నటుడు సోనూసూద్. కరోనా లాక్‌డౌన్ లో పేదలని ఆదుకొనేందుకు ముందుకొచ్చాడు. పేదల ఆకలి తీర్చాడు. ఆర్థిక సాయం చేశాడు. వలస కూలీలని ఆడుకున్నాడు. వారిని సొంత ఖర్చులతో క్షేమంగా ఇంటికి చేర్చాడు. మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలని ఆదుకున్నారు. వారికి ఆర్థిక సాయం చేశాడు. ఇప్పటికీ ఆపదలో ఉన్నా.. అంటూ ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సోనూసూద్ గొప్పతనాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది.

సేవ చేయడంలోనే దైవాన్ని చూసుకుంటున్న సోనుసూద్.. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబయోగ్రఫీ (సోనూసూద్‌ ఆత్మకథ) ‘ఐ యామ్ నో మెస్సీయ’ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్తకాన్ని చిరంజీవికి అందజేశాడు.

ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘వీరులు తయారవుతారు..పుట్టరని మీ పుస్తకంతో మరోసారి నిరూపించారు. వేలాదిమందికి సాయం చేస్తూ సాగిన నీ ప్రయాణం కోట్లాదిమందికి స్పూర్తిని కలిగించే విషయమని’ చిరు రాసుకొచ్చారు. సోనూసూద్ సేవలను గుర్తు చేస్తూ పుస్తకం రావడంతో చిరు కంగ్రాట్స్ చెప్పారు.